సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (08:43 IST)

'అమ్మా.. నేనూ నీ వద్దకే వస్తున్నా'... గుంటూరు యువకుడు సూసైడ్

అమ్మలేని లోకంలో జీవించలేని ఆ బిడ్డ.. అమ్మా.. నేనూ నీ వద్దకే వస్తున్నానంటూ గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

అమ్మలేని లోకంలో జీవించలేని ఆ బిడ్డ.. అమ్మా.. నేనూ నీ వద్దకే వస్తున్నానంటూ గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గుంటూరు పట్టణంలోని కొరిటెపాడుకు చెందిన డొంకేని సాయిసందీప్‌ (23) తండ్రి శ్రీనివాసరావు ఆరేళ్ల కిందట చనిపోయాడు. ఆయన భార్య రాధా కుమారి. చిన్నతనంలోనే భర్త మరణించినప్పటికీ.. తన బిడ్డ సాయి సందీప్ కోసం ఆమె రెండో పెళ్లి చేసుకోలేదు. పైగా తండ్రిలేడనే లోటును ఎక్కడా కనిపించకుండా బిడ్డను పెంచడమేకాకుండా, డిగ్రీ వరకు చదివించింది. ఏడాది కిందట తల్లికూడా మృత్యువాత పడటంతో అతని జీవితం తల్లకిందులైంది. కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో మానసికంగా కుంగిపోయాడు.
 
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొన్ని నెలల నుంచి అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకు ఎవరూ లేరన్న బాధను దిగమింగుకోలేక, అనాథ అన్న మాటను జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం అర్థరాత్రి దాటాక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
గురువారం ఉదయం ఎంతసేపటికీ సాయిసందీప్‌ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని అన్నమ్మ తలుపులు గట్టిగా తట్టి చూసింది. సందీప్‌ చీరకు వేలాడుతూ కనిపించడంతో నివ్వెరపోయిన ఆమె స్థానికులకు చెప్పి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వచ్చి అక్కడ పరిశీలించగా, సూసైడ్ నోట్ లభించింది. 
 
అందులో 'ఆరేళ్ల కిందట నాన్న మరణించాడు.. కష్టమంటే ఏంటో తెలీకుండా పెంచిన అమ్మ కూడా ఏడాది కిందట నన్ను విడిచి వెళ్లిపోయింది. నన్ను చూసి ఈ లోకం అనాథ అంటూ సూటిపోటి మాటలంటోంది. అమ్మా, నాన్న లేని ఈ లోకంలో నేను ఉండలేను. అమ్మా.. నేనూ నీ వద్దకే వస్తున్నా' అంటూ ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.