గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (19:16 IST)

పొద్దస్తమానం ఆరోపణలేనా? ఒక్కటైనా నిరూపించారా? : జీవీఎల్ ప్రశ్న

gvl narasimha
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని గత మూడేళ్లుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు పొద్దస్తమానం ఆరోపిస్తున్నారనీ, వారు చేసే ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్క ఆరోపణ అయినా నిరూపించారా? అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. 
 
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, అమరావతిలో అక్రమాలంటూ మూడేళ్లుగా ఆరోపణలు చేస్తున్న వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయిందన్నారు. 
 
పైగా, రాష్ట్రంలో మూడు రాజధానుల విధానం సాధ్యం కాదనే విషయం సీఎం జగన్‌కు బాగా తెలుసున్నారు. అయినప్పటికీ మూడేళ్లుగా అరిగిపోయిన క్యాసెట్టే మళ్లీ మళ్లీ వేస్తున్నారన్నారు. 
 
విశాఖలో రాజధాని అంటున్నారు.. అక్కడ వైకాపా నేతలు భూదందాలు చేయడానికా? అని ప్రశ్నించారు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని భావించే వాళ్లు అయితే విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం పట్ల ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధి కోసం రాష్ట్రం కేంద్రానికి అనేక రకాలుగా సహకరించాల్సివుందన్నారు. కానీ, సీఎం జగన్ ఏమాత్రం సహకరించడం లేదన్నారు. 
 
విశాఖ అభివృద్ధికి సహకరించని జగనే.. విశాఖ రాజధాని అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అమరావతిలో కనీస మౌలిక  సదుపాయాలను కల్పిస్తే తమ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.