ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (16:13 IST)

ఏపీలో భారీ వర్షాలు - 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ తుఫాన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని 9 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ విధించారు. అత్యవసర పనులు ఉంటేనే కానీ ప్రజలెవరూ ఇండ్లు విడిచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
 
తుఫాను ప్రభావంతో బుధవారం అర్థరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వర్షాలపై కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు.
 
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారని గుర్తుచేశారు.
 
ఈ నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు రెండు చొప్పున ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని జగన్‌ తెలిపారు.
 
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. 
 
గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
 
అల్పపీడనం శుక్రవారం నాటికి బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణించే అవకాశమున్నదని పేర్కొన్నారు. 
 
దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.