గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (10:11 IST)

తిరుమల కొండ భక్తుల రద్దీతో నిండిపోయింది.. దర్శనానికి 48 గంటలు

Tirumala
Tirumala
దసరా సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి వున్నారు. 
 
నారాయణగిరి నుంచి గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు నిదానంగా కదులుతుండగా, స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. 
 
దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఉదయం వరకు క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది. ఈ సాయంత్రం క్యూలైన్ల వద్దకు వచ్చిన భక్తులను అధికారులు తిప్పి పంపారు.  
 
దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గోగర్భం వద్ద క్యూలైన్లను పరిశీలించిన ఆయన, తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారని, అందుకే రద్దీ పెరిగిందని అన్నారు. రద్దీ వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
 
తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో ఉండాలని టిటిడి ప్రజాసంబంధాల అధికారి కోరారు. 
 
భక్తులు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం క్యూలైన్లలోకి ప్రవేశించాలని టిటిడి ప్రజాసంబంధాల అధికారి పేర్కొన్నారు.