శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (21:38 IST)

రాష్ట్రానికి ఉదారంగా సాయం అందేలా చూడండి: నీలం సాహ్ని

తుఫాను వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం నుండి అన్ని విధాలా మెరుగైన సాయం అందేలా చూడాలని కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నివిజ్ణప్తి చేశారు.

రాష్ట్రంలో తుఫాను,భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం అంచనా వేసేందుకు సౌరవ్ రాయ్ నేతృంత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృదం రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర అధికారులతో సమావేశమైంది.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ ఆగష్టు,సెప్టెంబరు,అక్టోబరు మాసాల్లో తుఫాను,అల్పపీడనాల వల్ల సంభవించిన వర్షాలు కారణంగా పెద్దఎత్తున పంటలు దెబ్బతిని రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లిందని చెప్పారు.అయితే ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యలు ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల ప్రాణ ఆస్థి నష్టాలను చాలా వరకూ తగ్గించగలిగామని పేర్కొన్నారు.

దేశంలో ఏరాష్ట్రంలో చేయని విధంగా వెంటనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందించడంతోపాటు నీట మునిగిన కుటుంబాలకు తగిన సహాయం అందించామని సిఎస్ నీలం సాహ్ని కేంద్ర బృందానికి వివరించారు. వర్షాలకు తడిసిన రంగుమారిన ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసేందుకు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాల్సిన అవసరం ఉందని ఆదిశగా కేంద్ర బృందం కేంద్ర ప్రభుత్వానికి వారి నివేదికలో సిఫార్సు చేయాలని విజ్ణప్తి చేశారు.

అదే విధంగా దెబ్బతిన్న వేరుశెనగ పంట కొనుగోలుకు కూడా నిబంధనలు సడలించేలా చూడాలని కోరారు.రాష్ట్రంలో అగష్టు,సెప్టెంబరు,అక్టోబరు మాసాల్లో తుఫాను అల్పపీడనం ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వివిధ రంగాలకు సంబంధించి మొత్తం 6వేల 386కోట్ల రూ.లు మేర నష్టం వాటిల్లిందని సిఎస్ కేంద్ర బృందానికి నివేదిక అందించారు. తాత్కాలిక పునరుద్దరణ సహాయ చర్యలకు 840 కోట్లు అవసరం కాగా శాశ్వత పునరుద్ధణ చర్యలకు 4వేల 439కోట్ల రూ.లు అవసరం అవతాయని సిఎస్ పేర్కొన్నారు.
 
వ్యవసాయానికి సంబంధించి 2లక్షల 12వేల హెక్టార్లలో వరిపంట దెబ్బతిని 903 కోట్లు నష్టం వాటిల్లిందని,ఉద్యానవన పంటలకు సంబంధించి 24వేల 516 హెక్టార్లలో పలు పంటలు దెబ్బతిని 483 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు.అదే విధంగా ఆర్అండ్బికి సంబంధించి 5వేల 583 కి.మీ రోడ్లు దెబ్బతిని 2వేల 976కోట్లు నష్టం జరిగిందని తెలిపారు.జలవనరుల శాఖకు సంబంధించి 1081 మైనర్,142 మీడియం,443 మేజర్ ఇరిగేషన్ పనులు దెబ్బతిని 1074 కోట్లు నష్టం కలిగిందని చెప్పారు.

పంచాయితీ రాజ్ శాఖకు సంబంధించి 3వేల 125 కి.మీల మేర రోడ్లు,సిడి పనులు దెబ్బతిని 781కోట్ల రూ.ల నష్టం వాటిల్లిందని తెలిపారు.అంతే గాక మున్సిపల్ పరిపాలన శాఖకు 75కోట్ల రూ.లు మేర నష్టం వాటిల్లిందని ఇంకా పశు సంవర్ధక,మత్స్య,ఇంధన,ఆర్డబ్ల్యుఎస్ తదితర విభాగాలకు నష్టం వాటిల్లిందని సిఎస్ నీలం సాహ్ని కేంద్ర బృందానికి వివరించారు.
 
రాష్ట్ర రెవెన్యూ మరియు విపత్తునల నిర్వహణ సంస్థ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మాట్లాడుతూ భారీ వర్షాలు,వరదలకు రాష్ట్రంలో మొత్తం 387 మండలాలు ప్రభావితం కాగా 3వేల 310 గ్రామాలు ప్రభావితమయ్యాయని తెలిపారు.448 గ్రామాలు,స్థానిక సంస్థలు,27 పట్టణాలు ముంపునకు గురికాగా 17లక్షల 74వేల మంది వరదలకు ప్రభావితమయ్యారని వివరించారు.45మంది చనిపోగా,5గురు గల్లంతయ్యారని 8వేల 784 గృహాలు దెబ్బతిన్నాయని చెప్పారు.లక్షా 68వేల 603 గృహాల చుట్టూ నీరు చేరిందని వివరించారు.

అదే విధంగా 2లక్షల 85వేల మందిని 393 సహాయ పునరావాస శిబిరాలకు తరలించి వారికి 12లక్షల 85వేల ఆహార పొట్లాలను,85లక్షల 66వేల మంచినీటి ప్యాకెట్లను,34వేల 708 లీటర్ల పాలును అందించడం జరిగిందని తెలిపారు.అలాగే 738 ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా నిర్వహించడం జరిగిందని ఉషారాణి తెలిపారు.

ఇళ్ళ చుట్టూ నీరుచేరిన కుటుంబాలకు 2వేల రూ.లు వంతున నగదును,25కిలోల బియ్యం,కిలో కందిపప్పు,కిలో ఆయిల్,కిలో ఉల్లి పాయలు,కిలోల టమాటాలను ఉచితంగా అందించడం జరిగిందని ఇందుకుగాను మొత్తం 399 కోట్ల రూ.లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని ఉషారాణి కేంద్ర బృందానికి వివరించారు.

అలాగే వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,ఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణ బాబు,పౌరసరఫరాల శాఖ కమీషనర్ కె.శశిధర్,మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి రామ్ మోహన్ వారి శాఖలవారీగా జరిగిన నష్టాల వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.అంతకు ముందు 1వ భవనంలో వరదల నష్టంపై వివిధ శాఖలపై ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం తిలకించింది.

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్ రే నేతృత్వంలోగల ఏడుగురు సభ్యులతో కూడిన ఈకేంద్ర బృందంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ కమీషనర్ ఆయుష్ పునియ,ఇంధన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఓపి సుమన్, ఆర్ధికశాఖ కన్సల్టెంట్ ఆర్ బి కౌల్,వ్యవసాయ,సహకార మరియు ఫార్మర్స్ వెల్పేర్ జెడి డా.పొన్ను సామి హైదరాబాదు, జలశక్తి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ పి.దేవేంద్రరావు,హైదరాబాదు,మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు రవాణా,జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయం విజయవాడ ఎస్ఇ శ్రావణ్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక కమీషనర్ కన్నబాబు, వ్యవసాయశాఖ ప్రత్యేక కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్,వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఇఎన్సిలు తదతరులు పాల్గొన్నారు. అనంతరం ఈకేంద్ర బృందం తొలిరోజు పర్యటలో భాగంగా మూడు బృందాలుగా ఏర్పడి గుంటూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో క్షేత్ర పర్యటనలకు బయలుదేరి వెళ్లింది.