బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:22 IST)

సోనూ సూద్ సాయంపై నెటిజన్‌ అనుమానం, మీరు బాధితుడికే ఇచ్చారా?

ఇబ్బందుల్లో ఉన్నవారికి చేయూత అందిస్తూ.. కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకుంటూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు నటుడు సోనూ సూద్‌. ఆయన సాయంపై ఓ నెటిజన్‌ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ఆధారాలతో సహా అతడి అనుమానం తీర్చారు.

ఇటీవల ఓ వ్యక్తి తన వైద్యానికి సాయం చేయాలని ట్విటర్‌ వేదికగా కోరగా అతడికి సహాయం చేసినట్లు సోనూ సూద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సదరు నెటిజన్‌ స్పందిస్తూ ఆయనపై అనుమానం వ్యక్తం చేశాడు. అంతేగాక సాయం కోరిన వ్యక్తి చేసిన ట్వీట్‌లో అతడికి సంబంధించిన వివరాలు ఏవీ లేకుండానే ఎలా స్పందించారని ప్రశ్నించాడు.

అతడిది కొత్త ట్విటర్‌ అకౌంట్‌ అని కేవలం ఇద్దరూ ఫాలోవర్స్‌ మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నాడు. తన వైద్యానికి సహాయం చేయాల్సిందిగా అతడు ఒకే ఒక ట్వీట్‌ మాత్రమే చేశాడన్నాడని, అంతకుమించి అతడు ఎలాంటి అడ్రస్‌ ఇవ్వలేదన్నాడు.

పైగా అతడు సోనూ సూద్‌ను కూడా ట్యాగ్‌ చేయలేదని, కనీసం లోకేషన్‌ కూడా చెప్పలేదన్నాడు. అతడి ట్వీట్‌కు ఎలా స్పందించారని, సాయం ఎలా చేశారని.. గతంలో కూడా ఆయనను సాయం కోరుతూ వచ్చిన ట్వీట్‌లు ఇప్పుడు కనిపించడం లేదన్నాడు.