శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:34 IST)

కొల్లేరును త‌ప్పుగా చిత్రిక‌రిస్తారా? రిపబ్లిక్ సినిమాపై వ‌డ్డీల ఫైర్!

హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ చిత్రానికి ఆది నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. హీరో తేజ్ ఈ సినిమా రిలిజ్ ముందు రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఆ త‌ర్వాత ఆయ‌న కోలుకుంటుండ‌గా, ఆయ‌న లేకుండానే సినిమా ఫంక్ష‌న్ జ‌రిగింది. ఇందులో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌ని దుమారం చెల‌రేగింది. 
 
ఇపుడు తాజాగా, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాలో కొల్లేరును కాలుష్య కారకంగా, వ్యర్థాలతో చేపలను పెంచుతున్నట్లు చూపించడంపై వ‌డ్డీలు నిర‌స‌న‌ల‌కు దిగారు. కొల్లేరులో చేప‌లు పెంచి, ప‌ట్టుకునే ఈ వ‌ర్గం వారు ఏలూరు కలెక్టరేట్ వద్ద కొల్లేరు గ్రామ ప్రజల‌తో క‌లిసి ఆందోళనకు దిగారు. రిప‌బ్లిక్ సినిమా నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లేరులో  రాజకీయ పార్టీలకు సంబంధం లేద‌ని, కొల్లేరును గురించి తప్పుగా చిత్రీకరిస్తే తామంతా ఒక్కటిగానే స్పందిస్తామ‌ని చెప్పారు. కొల్లేరుపై సినిమాలో చూపించిన అవాస్త‌వ సన్నివేశాల్ని తొలగించకపోతే సినిమాపై సుప్రీం కోర్టుకు వెళ్తాం అని హెచ్చ‌రించారు. ఈ నిర‌స‌న‌లో కొల్లేరు పరిరక్షణ సమితి నాయకులు పళ్లెం ప్రసాద్, మండల కొండలరావు, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.