శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (12:50 IST)

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ పై వారెంట్ జారీ

కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరు కావడంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్ లత్కర్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 
 
 
ఆముదాలవలస మండలం తోటాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 121లో 70 సెంట్ల స్థలాన్ని భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ, ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకుని 8 వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గత ఏడాది మే 3న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.
 
 
కోర్టు నిర్ణయాన్ని ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదంటూ పిటిషనర్లు ఇటీవల కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కలెక్టర్ కోర్టుకు ఈనెల 7న హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. అయితే అధికారిక పనుల కారణంగా, విచారణకు జిల్లా కలెక్టర్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కలెక్టర్‌పై బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.