మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (17:05 IST)

బండికి హైకోర్టులో ఊరట.. రిమాండ్ రిపోర్టు కొట్టివేత.. బెయిల్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసన జీవో 317ను రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని కోరుతూ ఆయన కరీంనగర్‌లోని జాగరణ దీక్ష తలపెట్టారు. దీనికి కరీంనగర్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన తన నివాసంలోనే దీక్షకు దిగేందుకు పూనుకున్నారు. 
 
అయితే, కరీంనగర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆయన్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే, కింది కోర్టు జారీచేసిన రిమాండ్ రిపోర్టును కొట్టివేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదావేసింది.