1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (19:57 IST)

బండి సంజయ్ అరెస్టుపై నివేదిక కోరిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సజయ్‌ కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారంటూ కరీంనగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే, తన అరెస్టుపై, తన పట్ల కరీంనగర్ జిల్లా పోలీసులు నడుచుకున్న తీరుపై లోక్‌సభ సభ్యుడైన బండి సంజయ్.. లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తనను అరెస్టు చేసే సమయంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తన గల్లా పట్టుకుని వ్యానులో తోసేశారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. పైగా, ఎంపీగా తన గౌరవానికి భంగం కలిగించారని పేర్కొంటూ స్వీకర్‌కు లేఖ కూడా రాశారు. 
 
ఈ లేఖపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. బండి సంజయ్ అరెస్టు వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ హోం శాఖ కార్యదర్శిని ఆదేశించారు. దీంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రంగంలోకి దిగి బండి సంజయ్ అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. 
 
కాగా, ఉపాధ్యాయ బదిలీలు, జీవో 317లో మార్పులపై బండి సంజయ్ కరీంనగర్‌లోని తన నివాసంలో జాగరణదీక్షకు పూనుకోగా, కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నందున దీక్షకు పోలీసులు అనుమతివ్వలేదు. అయినప్పటికీ బండి సంజయ్ దీక్షకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అరెస్టు చేశారు.