బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (15:51 IST)

బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ - కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశం

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా 14 రోజులపాటు రిమాండ్‌కు విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. 
 
కాగా, ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా ఆయన జాగరణ దీక్షను తలపెట్టారు. దీనికి రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పైగా, ఆయన తన నివాసంలోనే ఈ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 
 
అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన నివాసంలోనే దీక్షకు దిగగా, దీన్ని పోలీసులు భగ్నం చేశారు. అదేసమయంలో ఆయన్ను అరెస్టు చేసే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టు వదలకుండా ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అరెస్టు చేశారు. 
 
ఒకవైపు కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ అనుమతి లేకున్నప్పటికీ దీక్ష చేయడానికి పూనుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అందుకే ఆయనపై నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. 
 
అయితే, ఆయన బెయిల్ కోసం కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని విచారించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అదేసమయంలో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. సంజయ్‌తో పాటు. కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్ తదితరలకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.