బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఇద్దరు పిల్లల తల్లి .... పురుషుడుగా మారిన వైనం... హక్కుల కోసం హైకోర్టుకు

ఆమెకు పెళ్లయి భర్త ఉన్నాడు. పైగా, ఇద్దరు పిల్లలకు తల్లి. కానీ, ఇపుడు ఆమె పురుషుడుగా మారింది. శరీరంలో చోటుచేసుకున్న మార్పులతో ఆమె పురుషుడుగా అవతరించాడు. ఈ వింత ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆమె/అతడు తన హక్కు సాధన కోసం హైకోర్టును ఆశ్రయించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైకు చెందిన 38 యేళ్ల మహిళ 23 యేళ్ళ వయసులో వివామైంది. ఈమె ఎంఏ సైకాలజీ విద్యను పూర్తి చేసింది. ఈమె పదేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఆ తర్వాత ఆమె శరీరంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
 
ఫలితంగా ఆమె తన పిల్లలతో అమ్మ అని కాకుండా అప్పా అని పిలుచుకోవడం ప్రారంభించింది. అయితే, ఆమెలో వచ్చిన మార్పులను గమనించిన భర్త కూడా కట్టుకున్న భార్యను ఒక మహిళగా కాకుండా అతడుగా పిలవసాగాడు. కానీ కుటుంబ సభ్యులతో పాటు సమాజంలో ఎదురవుతున్న చీత్కారాలను భరించలేని అతడుగా మారిన ఆ మహిళ తన హక్కుల సాధన కోసం హైకోర్టును ఆశ్రయించారు.
 
తన పిల్లల సర్టిఫికేట్లలో తండ్రి పేరు మాత్రమే కాకుండా తల్లిదండ్రుల పేర్లు ఉండేలా ఆదేశించాలని కోరింది. పైగా, వివాహానికి ముందే తన మానసిక పరిస్థితిని తల్లిదండ్రులకు వివరించాననీ, కాను పట్టించుకోకుండా తనకు వివాహం చేశారనీ ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. 
 
తన పరిస్థితిని అర్థం చేసుకున్న భర్త తనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారనీ, కానీ సమాజం మాత్రం చిన్నచూపు చూస్తోందని వాపోయింది. శరీరంలో సహజంగా వచ్చిన మార్పులకు ఈ సమాజం తనను బాధ్యురాలిని చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె హైకోర్టును ప్రశ్నించారు. తనకు హక్కుల కోసం తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆమె హైకోర్టును ఆభ్యర్థించింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించగా, త్వరలోనే విచారణ జరుగనుంది.