మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జులై 2020 (09:52 IST)

ప్రగతి భవన్ లో అంతమందికి వైరస్ ఎలా సోకింది?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో పలువురు సిబ్బందికి కరోనా సోకడం పట్ల ప్రభుత్వం నివ్వెరపోతోంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సీఎం నివాసంలోని ఇంతమందికి ఎలా వైరస్ సోకిందన్నదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇక్కడ పనిచేస్తున్నవారిలో ఇప్పటివరకు 30 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అన్నివిధాల జాగ్రత్తలు పాటించే భవన్‌లో.. వైరస్‌ చిత్రంగా వ్యాపించింది. ఇక్కడి సిబ్బందిలో ఎవరూ నేరుగా కొవిడ్‌ బారిన పడలేదు.

అయితే, సీఎం నిర్వహించే కార్యక్రమాలు, సమీక్షలకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు స్నాక్స్‌, భోజనం పెట్టేందుకు ఓ కేటరింగ్‌ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ సంస్థకు చెందిన ఏడుగురికి తొలుత మహమ్మారి సోకింది.

ఆ విషయం బయటపడే సరికే వారి నుంచి ఇతరులకు వ్యాపించింది. ముఖ్యమంత్రి భద్రతా విభాగం కీలక అధికారికి కూడా కరోనా నిర్ధారణ అయింది. డ్రైవర్లు, మిగతా సిబ్బందికి కూడా పాజిటివ్‌ వచ్చింది.

దీంతో ప్రగతి భవన్‌ను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. కాగా, వైరస్‌ బాధితుల్లో ఇప్పటికే కొందరు డిశ్చార్జ్‌ అయ్యారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు క్వారంటైన్‌లో ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్‌ బారినపడిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది.