వర్షాల కారణంగా నష్టపోయిన బాధితుల పట్ల అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద వచ్చింది. కర్నూలు, నంద్యాల వరద ప్రాంతాలో జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు.
అనంతరం నంద్యాల మున్సిపల్ స్కూల్‌లో వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో ఈ స్థాయి వర్షాలు అరుదని, పదేళ్ల తర్వాత ఇంతటి భారీ వర్షాలు కురిసాయని అన్నారు.
దేవుడు ఆకలి కేకలు ఉండకూడదని వర్షం పుష్కలంగా కురిపించాడని, మంచి వర్షాలు కురవడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయని సంతోషం వెలిబుచ్చారు. కర్నూలులో 66 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు అయ్యిందని, దాదాపు 17 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు.
వర్షం ఎక్కువగా పడటం వల్ల కాస్త నష్టంవాటిల్లిందన్నది వాస్తవమే నని, ఎక్కువ భాగం నష్టం రోడ్ల విషయంలో జరిగిందని అన్నారు. రూ.426 కోట్లు ఆర్ అండ్ బీ రోడ్ల విషయంలో, పంచాయతీ రాజ్ శాఖలో మరో రూ300 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. పంట నష్టం కూడా జరిగిందని , అలాగే . 2 వేల హెక్టార్లలో హార్టికల్చర్ కూడా దెబ్బతిందని అన్నారు జగన్.
నష్టంపై అంచనా వేసే సమయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఎక్కడా కూడా గట్టిగా పట్టుకోకుండా బాధితులకు న్యాయం చేసేలా అండగా నిలవాలని కోరారు. కాగా, గోదావరి నుంచి కృష్ణానదిలోకి నీరు ఎలా తీసుకురావాలో ఆలోచన చేస్తున్నామని చెప్పారు. కాగా వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాని తాత్కాలిక సాయం కింద రూ 2 వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
మంత్రుల పర్యటన..
గత వారం రోజుల నుండి కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ముంపుకు గురైన ప్రాంతాలను పురపాలక, పట్టణాభివృద్ధి , జిల్లా ఇంచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం శనివారం పరిశీలించారు.
మహానంది మండలం గాజులపల్లి గ్రామములో వరద ప్రభావిత ప్రాంతాలైన హరిజనపేట, మైనారిటీ కాలనీల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. నంద్యాల యం పి పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిలు మంత్రుల వెంట వున్నారు.
ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు బియ్యం, పప్పు ఇతర నిత్యావసర వస్తువులు వెంటనే పంపిణీ చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి ఆర్డీఓను ఆదేశించారు. వరద నష్టాన్ని పక్కాగా లెక్కించి నష్ట పరిహారం అందిస్తామని బాధితులకు వివరించారు.
వరదలకు దెబ్బతిన్న గృహాలు, పడిపోయిన గృహాలు, వరద నష్టాన్ని సరిగ్గా లెక్కించి నివేదికలు ఇవ్వాలని గ్రామ వలంటీర్లను ఆదేశించారు. ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డిపిఓ ప్రభకారరావు తదితరులు పాల్గొన్నారు.