ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 మే 2020 (21:39 IST)

ఉద్యోగులు వంద శాతం హాజరు కావాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంటు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు మినహా అన్నింటా ఉద్యోగులు వంద శాతం హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. 
 
రాష్ట్ర సచివాలయం నుంచి విభాగాధిపతులు, కలెక్టర్ కార్యాలయాలు ఇలా క్షేత్రస్థాయి వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ వందశాతం ఉద్యోగుల హాజరుతో విధులు నిర్వహించాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
సచివాలయం సహా అన్ని ప్రభుత్వ విభాగాలు, విభాగాధిపతులు, జిల్లా కార్యాలయాలు, క్షేత్రస్తాయి ప్రభుత్వ కార్యాలయాలూ విధులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. 21 తేదీ నుంచి వందశాతం సిబ్బందితో ప్రతీ కార్యాలయం విధులు ప్రారంభించాలని ఆదేశాలు వెలువడ్డాయి. 
 
కంటైన్మెంటు ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయలూ యథావిధిగా విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ వందశాతం హాజరు ఉండాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.  
 
కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూనే విధులకు హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్కు లేకుండా ఏ ఉద్యోగీ విధులకు హాజరు కాకూడదని తెలిపింది. ఉద్యోగులు కార్యాలయంలోనికి వచ్చే సమయంలో థర్మల్ స్కానర్లతో పరీక్ష చేయించుకోవాలని, ప్రతీ ఒక్కరికీ హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 
 
ప్రతీ ప్రభుత్వ కార్యాలయాన్నీ ప్రతీ రోజూ శానిటైజ్ చేయించాలని ప్రత్యేకించి ఎక్కువ మంది పట్టుకునే ఉపరితలాలను శానిటైజ్ చేయించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కొవిడ్ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించేలా టేబుళ్లు కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 
 
ఉద్యోగులు కార్యాలయ ప్రాంగణంలో పాన్, గుట్కా నమలడం, ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. భౌతికంగా పంపించే దస్త్రాలను సాధ్యమైనంత మేర తగ్గించి ఈ-ఫైల్స్ ద్వారా విధులు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. 
 
కార్యాలయంలో సాధ్యమైనంత మేర సమావేశాలు తగ్గించి టెలీ, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఈ ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. గర్భిణులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. 
 
ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకులను అనుమతిని నిషేధించటంతో పాటు ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులను స్పందన లేదా రిసెప్షన్ కౌంటర్ల ద్వారా మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. సచివాలయంలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ ఆదేశాలను అమలు చేసేలా బాధ్యత వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.