ప్రమాదంలో భర్త మరణం, కర్ఫ్యూతో భార్య రోడ్డు ప్రమాదంలో మృతి

Sandhya
ఎం| Last Modified గురువారం, 6 మే 2021 (17:47 IST)
ప్రమాదం రూపంలో భర్తను తీసుకువెళ్లింది. ఆ కుటుంబాన్ని కుంగదీసింది. భర్త స్మృతుల్లో కాలం వెల్లదీస్తున్న ఆమెకు కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగం లభిస్తే.. ఆ వ్యాపకాల్లో అయినా గాయం మానుతుందని భావించారు ఆ కుటుంబ సభ్యులు.

రోజూ బస్సులో విధులకు వెళ్లే ఆమె.. కర్ఫ్యూ నేపథ్యంలో బస్సులు ఉండవనుకుంటూ.. ద్విచక్ర వాహనంపై విధులకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. దగదర్తి మండలం లయన్స్‌ నగర్‌ వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం... నెల్లూరులో తన చెల్లితో నివాసం ఉంటున్న సంధ్య(29) కావలి ఆర్డీవో కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ అక్కడి నుంచి కావలికి బస్సులో వచ్చి విధులు ముగించుకుని తిరిగి వెళ్లేవారు.

బుధవారం నుంచి కర్ఫ్యూ నేపథ్యంలో మధ్యాహ్నం వరకే బస్సులు తిరుగుతాయని అధికారులు ప్రకటించడంతో సాయంత్రం వచ్చేటప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అని భావించిన సంధ్య.. తన స్కూటీపై కావలికి బయలుదేరారు. ఆ క్రమంలో దగదర్తి లయన్స్‌నగర్‌ సమీపంలోకి వెళ్లే సరికి వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొంది.

ప్రమాదంలో ఆమె తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై వేణుగోపాల్‌ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :