భూమి కోసం తల్లీ కుమారుడు కలిసి తండ్రిని నరికేశారు.. ఎక్కడ?
భూమికోసం తల్లీ కుమారుడు కలిసి తండ్రిని నరికేశాడు. ఈ దారుణం ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాళెంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని బీరోలు గ్రామానికి చెందిన బుడిగె సీతారాములు(65)కు భార్య సోమలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో సోమలక్ష్మి చనిపోయింది. అప్పుడే సత్యవతి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ వివాహితులు.
ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా సత్యవతి భర్తను వదిలివేసి కొన్ని రోజులుగా ఖమ్మంలో నివసిస్తోంది. అలాగే, సీతారాములు కూడా కుమారుడు శ్రీధర్, కోడలితో కలిసి ఉంటున్నారు. సీతారాములుకు 15 కుంటల భూమి ఉంది. అందులో వాటా కోసం గొడవలు జరిగాయి.
ఏడు కుంటల భూమిని సత్యవతి పేరిట స్టాంప్ పేపర్‌పై సీతారాములు రాసిచ్చాడు. భూమి పట్టా మాత్రం సీతారాములు పేరిటనే ఉంది. తన పేరున పట్టా చేయించాలని ఆమె పట్టుబట్టింది. దీనికి అతడు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అతడి ఆలనాపాలనను వారు పట్టించుకోవడం లేదు.
దీంతో, అతడు గ్రామంలోనే భిక్షాటన చేసుకుంటున్నాడు. పగ పెంచుకున్న సత్యవతి, తన కుమారుడు శ్రీధర్‌తో కలిసి శుక్రవారం అర్థరాత్రి సీతారాములును గొడ్డలితో నరికి చంపింది. శనివారం తెల్లవారుజామున ఇది వెలుగు చూసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సత్యవతితో పాటు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.