శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (15:31 IST)

ఈ నెల 24 నుంచి హైదరాబాద్ - బెంగూళూరుల మధ్య వందే భారత్ రైలు

vande bharat
రైల్వే ప్రయాణికులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ - బెంగూళూరు ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు ఈ నల 24వ తేదీ నుంచి పట్టాలెక్కనుంది. ఈ రైలుకు ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభోత్సవం చేయనున్నారు. 
 
కాచిగూడ వేదికగా జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు ఈ రైలు బయలుదేరి.. మహబూబ్‌‍నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11.45కు కాచిగూడ చేరుకుంటుంది.
 
కాగా, ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా మొత్తం 9 వందే భారత్ రైళ్ళను వర్చువల్‌ విధానంలో జెండా ఊపి ప్రారంభించనున్న విషయం తెల్సిందే. వీటిలో విజయవాడ - చెన్నై వందేభారత్ కూడా ఉంది. విజయవాడలో ప్రారంభమయ్యే ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల‌్‌కు చేరుకుంటుంది. 
 
గురువారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుదని వివరించారు. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.