మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (20:33 IST)

ఆస్తి, చదువు, అధికారం వుంటే కళ్లు నెత్తికెక్కుతాయి.. కానీ జగన్‌కు...

సాధారణంగా ఆస్తితో పాటు చదువు, అధికారం ఉంటే చాలా మందికి కళ్లు నెత్తికెక్కుతాయని, అలాంటిది వైఎస్. జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకమని శ్రీ చిన్నజీయర్ స్వామి అన్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ముచ్చింతల్ శ్రీరామ నగరులో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంప్రదాయ పంచెకట్టులో పాల్గొన్నారు. అలాగే, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై చిన్నజీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. జగన్‌కు ఆస్తి ఉంది. చదువు వుంది. అధికారం ఉంది. సాధారణంగా ఇవన్నీ ఉన్నవారికి కళ్లు ఎక్కడిక ఎక్కుతాయో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, జగన్ మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి అని అన్నారు. ఏమాత్రం అహం నెత్తికెక్కించుకోకుండా, తన ఆలోచనలతో ప్రజాపరిపాలనపై నిరంతరం దృష్టిసారిస్తున్నారని కితాబిచ్చారు. ఇది అభినందించదగిన విషయమన్నారు. 
 
ఈ సందర్భంగా జగన్‌ను ఉద్దేశించి చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఓ యంగ్ బాయ్ అన్నారు. అవునా? కాదా? అని చమత్కారంగా అడగ్గా జగన్ మాత్రం ఎప్పటిలానే చిద్విలాసంగా చిరునవ్వులు నవ్వారు.