హస్తినకు వెళ్ళనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం హస్తినకు వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర పెద్దలతో సమావేశంకానున్నారు. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అలాగే ఈ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంశాల కోసం మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం ఏమాత్రం స్పందించడం లేదు. దీంతో ఈ పర్యటనలో పోలవరం అంశాన్ని ప్రధానంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు.
అలాగే, మూడు రాజధానుల అంశం, అమరావతి భవిష్యత్ గురించి కేంద్రంలోని కీలక మంత్రులతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ యేడాదిలోనే ఆయనపై ఉన్న పలు కేసుల విచారణ ప్రారంభంకానుంది. ఈ అంశంపై కూడా ఆయన హోం మంత్రి అమిత్ షా వద్ద చర్చించే అవకాశం ఉంది.