భర్తకు గుండెపోటు... ముందుగానే చనిపోవాలని భార్య సూసైడ్
వారిద్దరూ అన్యోన్య దంపతులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. కానీ, ఉన్నట్టుండి భర్తకు గుండెపోటు వచ్చింది. దీంతో భార్య తీవ్ర ఆందోళనకు గురైంది. భర్త కంటే ముందే చనిపోవాలని ఆ వివాహిత భావించింది. ఈ విషయాన్ని కన్నతల్లికి చెప్పింది. అలాంటి పిచ్చి పనులు చేయొద్దంటూ హితవు పలికింది. కానీ, ఆ భార్య మాత్రం తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతే.. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని నారాయణపేటకు చెందిన సింధూజ (25), రహమత్‌నగర్‌కు చెందిన శివకుమార్ భార్యాభర్తలు. వీరికి 13, 8 యేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న శివకుమార్‌కు ఈ నెల 12న గుండెపోటు వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సింధూజ తీవ్ర మనస్తాపం చెందింది.
తల్లి రత్నాదేవికి ఫోన్ చేసి భర్తకంటే ముందు తానే చనిపోతానని ఏడ్చింది. దీంతో ధైర్యం చెప్పిన తల్లి.. అలాంటి పిచ్చిపనులు చేయొద్దని, అంతా కుదుటపడుతుందని నచ్చజెప్పింది. అయినప్పటికీ ఆందోళన నుంచి బయటపడని సింధూజ ఈ నెల 14న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సింధూజ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.