మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (14:57 IST)

క్రికెట్ అంటే పిచ్చి.. గ్రౌండ్‌లోనే తుదిశ్వాస విడిచిన క్రికెటర్

అతనికి క్రికెట్ అంటే అమితమైనపిచ్చి. అందుకే చిన్న వయసు నుంచి క్రికెట్ ఆడుతూ వచ్చాడు. విద్యార్థి దశలోనూ, ఉద్యోగం చేస్తున్నా, వివాహం చేసుకుని, పిల్లలకు తండ్రి అయినా కూడా తనకు క్రికెట్‌పై ఉన్న పిచ్చి మాత్రం పోలేదు. చివరకు అదే క్రికెట్ మైదానంలో తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. క్రికెట్ ఆడుతూ ఓ క్రికెట్ గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బాలాజీ నగర్‌కు చెందిన వీరేందర్ నాయక్ అనే క్రికెటర్‌‌కు రెండు నెలల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ క్రికెట్‌కు దూరంగా ఉండలేక పోయాడు. వైద్యులు సూచన చేసినప్పటికీ పెడచెవిన పెట్టాడు. 
 
ఈ నేపథ్యంలో క్రికెట్‌కి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సూచించారు. అయినప్పటికి అతడు బ్యాట్ పట్టకుండా, గ్రౌండ్‌లోకి దిగకుండా ఉండలేకపోయాడు. ఆదివారం ఈస్ట్‌ మారేడుపల్లి జీహెచ్‌ఎంసీ మైదానంలో ఎంపీ స్పోర్టింగ్‌, ఎంపీ‌బ్ల్యూస్‌ జట్ల మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో ఎంపీబ్ల్యూస్‌ జట్టు తరపున బ్యాట్ పట్టాడు. 
 
చాలాసేపు బ్యాటింగ్ చేసిన వీరేందర్ నాయక్ 55 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కానీ అప్పటికే అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై.. అమాంతం కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది, తోటి ఆటగాళ్లు హుటాహుటిన సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు.. తోటి క్రికెటర్లు బోరున విలపించారు.