మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (10:05 IST)

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ వంతెన

Cable-Stayed Cum Suspension Bridge Across Krishna River
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దేశంలోనే తొలిసారి ఐకానికి కేబుల్ కమ్ సస్పెన్షన్ వంతెనను నిర్మించనున్నారు. ఈ వంతెనను కృష్ణానదిపై నిర్మిస్తారు. ఇందుకోసం రూ.1,082.56 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ వంతెనను 30 నెలల్లో పూర్తి చేసేలా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని ఆ శాఖామంత్రి నితిన్ గడ్కరీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఈ వంతెనను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా - కర్నూలు జిల్లా మధ్య సోమశిల వద్ద నిర్మితంకానుంది. ఇది పూర్తయితే ప్రపంచంలో రెండోది.. దేశంలో మొదటిది అవుతుందని.. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. 
 
దీనికి తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటాయని.. వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందన్నారు. పర్యాటక ప్రాంతంగా అలరారేందుకు కూడా అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్‌ వాక్‌వే ఉంటుందని.. గోపురం వంటి పైలాన్లు ఉంటాయని ఆయన తెలిపారు.