మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (14:56 IST)

విశాఖ రైల్వే జోనూ పాయే ... చేతులెత్తేసిన కేంద్రం

indian railway
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల్లో మరో ప్రధాన హామీ గాల్లో కలిసిపోయింది. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవినీతి కేసుల భయంతో విశాఖ రైల్వే జోన్‍‌ గురించి మాటమాత్రం కూడా ప్రస్తావించలేదు. దీంతో కేంద్రం చేతులెత్తేసింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అసాధ్యమని తేల్చి చెప్పింది. ఇందుకోసం రైల్వే శాఖ చెప్పిన కుంటి సాకు ఏంటంటే... విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు ఏమాత్రం లాభదాయకం కాదని చెప్పింది. అందుకే రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్‌ను ఆమోదించలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 
 
ఏపీ విభజన సమస్యలు, హామీలపై ఢిల్లీలో కేంద్రం హోం శాఖ మంగళవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో ఒక సమావేశం నిర్వహించింది. హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ కీలక సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రైల్వే జోన్, విభజన సమస్యలతో సహా మొత్తం 14 అంశాలపై చర్చ జరిగింది. 
 
ఇందులో విశాఖకు రైల్వే జోన్ అంశంపై కేంద్రం తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుకనే డీపీఆర్‌ను ఆమోదించలేదని రైల్వే బోర్డు ఛైర్మన్ సమావేశంలో వెల్లడించారు.  
 
రైల్వే బోర్డు ఛైర్మన్ వ్యాఖ్యలపై అజయ్‌ భల్లా స్పందిస్తూ, జోన్ ఏర్పాటు సాధ్యం కాదన్న విషయాన్ని అధికారుల స్థాయిలోనే నిర్ణయించేయడం సరికాదని, రైల్వే జోన్ విషయం రాజకీయ పరమైన అంశం కాబట్టి దానిని కేబినెట్ ముందు పెడితే అది ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. 
 
మరోవైపు, ఈ భేటీ తర్వాత తమ ప్రభుత్వం తరపున వినిపించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఐదు పేజీల ప్రకరటన విడుదల చేయగా ఏపీ ప్రభుత్వ అధికారులు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. పైగా, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సమస్యలకు తెలంగాణ అధికారులు అడ్డు చెప్పారు. ఫలితంగా అన్ని సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.