మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 8 జులై 2021 (13:25 IST)

అనుమతి లేకుండా డ్రోన్ ఎగుర‌వేస్తే.. అరెస్టే!

పోలీస్ ముంద‌స్తు అనుమ‌తులు లేకుండా డ్రోన్ ఎగుర‌వేస్తే, ఇక అరెస్టు చేస్తామ‌ని తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు హుకుం జారీ చేసారు. డ్రోన్ కెమెరాలతో చిత్రీకర‌ణ‌తో ఇతరుల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, పోలీసు స్టేషన్లు, ఎయిర్ పోర్ట్ ల వద్ద, ఇతర నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్ లను వాడితే కఠిన చర్యలుంటాయ‌న్నారు. తిరుపతి అర్బన్ జిల్లాలో ఉన్న డ్రోన్ ఆపరేటర్లతో, ఫోటోగ్రఫి అసోసియేషన్ సభ్యులతో ఆయ‌న స‌మావేశ‌మై నిబంధ‌న‌ల‌ను తెలియ‌జేశారు. 
 
వైమానిక రంగంలో డ్రోన్, మానవ రహిత ఎయిర్ క్రాఫ్ట్ సిస్టం,  రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. కొంద‌రు స్వయం ఉపాధిగా, మ‌రికొందరు హాబీగా డ్రోన్ కెమేరాలతో  చిత్రీకరిస్తున్నారని, డ్రోన్ ల వల్ల వినోదంతో పాటు ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. డ్రోన్ నియ‌మ నిబంధ‌న‌లివి.
 
✅ కనుచూపు మేరలో మాత్రమే డ్రోన్ ను ఎగిరేలా నియంత్రిస్తుండాల‌ని, అనుమతించిన ఎత్తు లోనే డ్రోన్ ఉండేలా చూసుకోవాలి.
 
పగటి పూట (సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోగా) మాత్రమే వినియోగించాలి.
 
డిజిటల్ స్కై ప్లాట్ ఫామ్ ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలి.
 
డ్రోన్ ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా మంచి కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి.
 
ఫ్లైయింగ్ మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలి.
 
డ్రోన్ నిషేధిత ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలి.
 
ఇతరుల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించకూడదు.
 
చేయకూడనివి మరియు తప్పకుండా పాటించవలసిన నియమాలు:-
 
భూమట్టం నుండి 400 అడుగుల (120 మీ) కంటే ఎక్కువ డ్రోన్లను ఎగురవేయరాదు.
 
విమానాశ్రయాలు, హెలిప్యాడ్ ల సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్ ను వినియోగించరాదు.
 
జనసమూహాలుండే ప్రదేశాలు, బహిరంగ కార్యక్రమాలు, జనంతో ఉన్న స్టేడియంలలో డ్రోన్ లు వినియోగించరాదు.
 
ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలపై, నో-డ్రోన్ సమీపంలో డ్రోన్‌ ను ఎగురవేయరాదు.
 
ప్రైవేట్ ఆస్తుల సమీపంలో వారి అనుమతి లేకుండా చిత్రీకరించకూడదు.
 
AAI/ADC 24 గంటల ముందు దాఖలు చేయకుండా విమానాశ్రయాల సమీపంలో నియంత్రిత ఆకాశ మార్గంలో డ్రోన్‌ ను ఎగురవేయరాదు.
 
ప్రమాదకరమైన పదార్థాలను తీసుకెళ్లకూడదు లేదా కింద పడవేయకూడదు.
 
మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి డ్రోన్ వినియోగించకూడదు.
 
కదిలే వాహనాల నుండి డ్రోన్ ను ఎగరవేయకూడదు.