శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జులై 2021 (19:26 IST)

నెల్లూరు: అడవిలో తప్పిపోయిన బాలుడు.. డ్రోన్ల సాయంతో గాలింపు

తండ్రి గొర్రెలు మేపడానికి అడవిలోకి వెళ్లగా.. వెనుకే వెళ్లిన మూడేళ్ల బాలుడు తప్పిపోయాడు. అడవిలో తప్పిపోయిన బాలుడి కోసం వరుసగా ఐదవ రోజు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులు డ్రోన్ల సహాయంతో పోలీసులు, అధికారులు బాలుడి కోసం గాలిస్తున్నారు. మంగళవారం పోలీసు జాగిలాలని రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
అటు కిడ్నాప్‌ కోణంలోనూ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈనెల 1న కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో సంజు(3) అనే బాలుడు తప్పిపోయాడు.  తండ్రి గొర్రెలు మేపడానికి వెళ్లగా బాలుడు సంజు వెనకే వెళ్లి తప్పిపోయాడు.
 
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలోని అరుంధతి వాడకు చెందిన దండు బుజ్జయ్య, వరలక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం. బుజ్జయ్య గొర్రెలు కాస్తుండగా.. వరలక్ష్మీ కూలీ పనులు చేసేది. జూలై 1న బుజ్జయ్య గొర్రెలను మేపడం కోసం సమీపంలోని వెలుగొండ అడవిలోకి వెళ్లాడు. మాములుగా రోజు తండ్రి వెనుక వెళ్లే సంజూ.. కొద్ది దూరం వెళ్లాక వెనక్కి వచ్చేవాడు. 
 
కానీ ఐదు రోజుల క్రితం తండ్రి వెనుక వెళ్లిన సంజూ తిరిగి రాకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రులు సమాచారం అందించారు. రెండు రోజులపాటు డ్రోన్ల సాయంతో వెతికినప్పటికీ.. బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో జాగిలాలను రప్పించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.