సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 31 జులై 2021 (16:28 IST)

రాబోయే రోజుల్లో ఊరికో రౌడీ: చంద్రబాబు

మాజీ మంత్రి దేవినేని ఉమాపైన కేసులు వేయడం దారుణం, దుర్మార్గమని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలే టీడీపీ దాడులు చేసి, రివర్స్ కేసులు పెట్టారని మండిపడ్డారు.

కొండపల్లి బొమ్మలు తయారు చేసే చోట చెట్లను నరికేస్తున్నారన్నార‌ని, పర్యావరణం దెబ్బతింటుందని ఉమాతో పాటు టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారని చెప్పారు. ఉమాపైన హత్యాయత్నం కేసు పెట్టడానికి ప్రభుత్వానికి సిగ్గుందా అని నిలదీశారు.
 
డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇలా చేయడం అన్యాయమని చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. ఎంతోమంది డీజీపీలు తన దగ్గర పనిచేశారని, ఎప్పుడు ఈ డీజీపీలా ఎవరూ ఇలా చేయలేదన్నారు. అవినీతి జరుగుతుందని టీడీపీ నేతలు అక్కడికి వెళ్తే ఇంత నీచంగా వ్యవహారిస్తారా అని ప్రశ్నించారు. దేవినేని ఉమా ఏం తప్పు చేశారన్నారు.

ఎనిమిది గంటలు కారులోనే ఉన్నారని, దేవినేని ఉమా ప్రాణాలు కాపాడాలని డీజీపీకి తాను లేఖ రాశానని చంద్రబాబు చెప్పారు. దేవినేని ఉమాను రూటు మార్చింది పోలీసులు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని చెప్పారు. వైసీపీ నేతలు రాళ్లేస్తే పారిపోతామా అని నిలదీశారు. 
 
ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. రెండేళ్ల నుంచి వారిపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. సంక్షేమం.. హక్కులు లేవని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాజకీయ లబ్ధి కోసమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీని వాడుకుంటున్నారని, వాళ్లకు ఏవిధంగానూ వైసీపీ సర్కారు ఉపయోగపడడం లేదన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని దుయ్యబట్టారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయినప్పుడే రాష్ట్రామంతా నాశనమైందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఊరికొక రౌడీ వస్తాడని చంద్రబాబు అన్నారు.