సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 31 జులై 2021 (15:08 IST)

చంద్రబాబును కలిసి మురిసిపోయిన 97ఏళ్ల వృద్ధుడు

ఈయన పేరు కట్టా పెదవేమారెడ్డి... గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెం గ్రామం.... వయసు 97ఏళ్లు. సెంచరీకి చేరువలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు పడిన తపన, నవ్యాంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పడిన శ్రమను గమనిస్తూ వచ్చిన ఆ పెద్దాయన, తన జీవితకాలంలో ఒక్కసారైన చంద్రబాబును కలసి తన మనోగతాన్ని తెలియజేసి అభినందించాలని భావించారు.

ఎన్నోమార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు... ఇటీవల పెదవేమారెడ్డి కోవిడ్ బారిన పడి అతికష్టం మీద కోలుకున్నారు... చంద్రబాబునాయుడుని కలవాలన్న తన మనోభీష్టాన్ని కుటుంబసభ్యులు, సన్నిహితులకు తెలియజేయడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబునాయుడు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ అమరావతిలోని తన నివాసానికి పిలిపించుకుని ఆప్యాయంగా మాట్లాడటంతో పెదవేమారెడ్డి మురిసిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ గత వైభవం సంతరించుకోవాలంటే మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన తన ఆకాంక్షను చంద్రబాబు ఎదుట వ్యక్తం చేశారు. జీవితకాలంలో ఒక్కమారైనా చంద్రబాబునాయుడును కలవాలన్న కల నెరవేరడంతో ఆ పెద్దాయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. త‌న‌కు చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న స‌మ‌ర్ధ‌త న‌చ్చుతుంద‌ని పెద వేమారెడ్డి చెపుతున్నారు.