శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (09:58 IST)

స్కిల్ డెవలప్‌మెంట్ క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు...

chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తీర్పును వెలువరించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అయిన తనను గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేశారని, తన అరెస్టు 17ఏ చట్టం కింద వ్యతిరేకమని, అందువల్ల ఈ కేసును కొట్టి వేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలు దఫాలుగా సుధీర్ఘ వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును మాత్రం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. దీంతో ఈ తీర్పు కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
మరోవైపు, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఉపశమనం కలిగే తీర్పు వస్తుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. కేసు ఎప్పుడు నమోదైనా, ఎఫ్ఎస్ఐఆర్ ఎప్పుడు నమోదయిందనే దాన్నే పరిగణనలోకి తీసుకోవాలనేది నిబంధనల్లో స్పష్టంగా ఉందని రఘురాజు తెలిపారు. 
 
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ యువనేత నారా లోకేశ్ భేటీ కావడం తమ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ సమావేశాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరే ఏర్పాటు చేసినట్టు తమ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. పురంధేశ్వరి సమావేశాన్ని ఏర్పాటు చేయించినట్టయితే... ఆ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ఉన్నారని సెటైర్ వేశారు.
 
ఇకపోతే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి సీఎం జగన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని... ఇది ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనమని రఘురాజు విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో జగన్ నివాసం ఏర్పాటు చేసుకున్నారని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాడేరు, అరకు కూడా వెనుకబడి ఉన్నాయని... నివాసం అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు.