బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 28 జనవరి 2021 (23:02 IST)

సొంత పార్టీ నేతలపైనే రోజా అలకబూనారా? అసలేమైంది?

వైసిపి ప్రభుత్వం ముందున్న సవాల్ పంచాయతీ ఎన్నికలు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుబట్టి మరీ ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రకరకాలుగా ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతున్నారంటూ వైసిపి నేతలు చెప్పుకుంటున్నారు.
 
కరోనా లేకపోయినా ఉన్నట్లు చూపిస్తూ ఎన్నికలను ఆపడం ఏ మాత్రం ఎన్నికల కమిషనర్‌కు ఇష్టం లేదు. దీంతో కోర్టులను ఆశ్రయించాడు. చివరకు న్యాయస్థానాల తీర్పుతో గెలిచాడు. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులను సిద్థం చేశారు.
 
ఈ నేపథ్యంలో వైసిపి సవాల్‌గా తీసుకుంది ఎన్నికలను. అసలు ఎన్నికలే జరగనీయకుండా ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తిరుపతి వేదికగా వైసిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పంచాతీరాజ్, గ్రామీణాభివృద్థి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.
 
పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. అయితే వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న రోజా మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలిచినా ఆమె మాత్రం సమావేశానికి డుమ్మా కొట్టేశారు. అందుకు కారణం నారాయణస్వామేనంటూ గుసగుసలాడుకుంటున్నారు వైసిపి కార్యకర్తలు. 
 
వేరే ప్రాంతంలో ఉండి ఆమె రాలేకపోయినా ఫర్వాలేదు. సొంత నియోజకవర్గంలోనే రోజా ప్రస్తుతం ఉన్నారు. అయితే జిల్లాలోనే ఉండి సమావేశానికి హాజరు కాకపోవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తన ఆవేదనను ప్రివిలైజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళినా వారు పట్టించుకోకపోవడం.. సొంత పార్టీ నేతలే తన గురించి వ్యంగ్యంగా మాట్లాడుకోవడం రోజాకు ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల కార్యక్రమానికి రోజా పూర్తిగా డుమ్మా కొట్టేశారని ఆమె అనుచరులే చెప్పుకుంటున్నారు.