రేపు వాహన మిత్ర నిధుల విడుదల - విశాఖకు వెళ్లనున్న సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్టణంకు వెళుతున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒకటైన వాహన మిత్ర నిధులను అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు వెళుతున్నారు.
నిజానికి ఆయన ఈ నెల 13వ తేదీనే విశాఖకు వెళ్లాల్సివుంది. కానీ, వర్షాల కారణంగా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో విశాఖకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కాగా, ఈ పర్యటనలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం లబ్దిదారుల ఖాతాల్లో ఈ యేడాది నిధులను ఆయన జమ చేయనున్నారు. సొంత వాహనాలు కలిగిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు యేడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేలా ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ పథకం కింద మొత్తం రూ.261 కోట్లను జమ చేస్తారు.
మరోవైపు, ఈ పర్యటనలో భాగంగా, ఆయన ఆంధ్రా విశ్వవిద్యాయంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి ఈ నిధులను విడుదల చేసి ఆ తర్వాత లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తాడేపల్లికి తిరిగి చేరుకుంటారు.