జగన్ సీఎం అవుతారు.. కానీ ఆ పని మాత్రం తప్పక చేయాల్సిందే.. ప్రశాంత్ కిశోర్
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైకాపా గెలవడం ఖాయమని.. ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రశాంత్ కిశోర్ సారధ్యంలో పనిచేస్తున్న ఐప్యాక్ ఆఫీసుకు జగన్ వెళ్లారు. అక్కడ ప్రశాంత్ కిశోర్‌ను, ఆయన బృందాన్ని జగన్ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ బృందం రెండేళ్లుగా వైసీపీకి సేవలు అందిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన జగన్ అక్కడున్న ఉద్యోగులను నవ్వుతూ పలకరించారు. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్.. జగన్ మోహన్ రెడ్డికి ఓ సూచన చేశారు. ''ఏపీలో మీరే సీఎం కాబోతున్నారు. మీరు సీఎం కావాలి. ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలి'' అని పీకే సూచించారు.
కాగా.. మొన్న జరిగిన ఏపీ ఎన్నికలలో అక్కడక్కడా అల్లర్లు, ఉద్రిక్తతలు నెలకొన్నా మిగిలిన చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది. అయితే ముందునుంచి అధికారంలో ఉన్న టీడీపీలోని అగ్ర శ్రేణులు మాత్రం ఎక్కువ మొత్తంలో ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేశారని తెలుస్తోంది. ఈసారి కూడా 130 సీట్లకు పైగానే గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు విపక్షంలో వున్న వైకాపా అగ్రశ్రేణులు మాత్రం ప్రజల్లో ఏపీ సీఎం చంద్రబాబుమీద ఉన్న వ్యతిరేకత కారణంతో ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని తప్పకుండా మేమే 130 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మరి ఇంతకీ ఏపీలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో తెలియాలంటే వేచి చూడాలి మరి.