బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (14:11 IST)

వైకాపా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : శ్రీకాంత్ రెడ్డి

ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైకాపా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని రాయచోటి వైకాపా అభ్యర్థి గండికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏపీ పోలింగ్ సరళిపై ఆయన మాట్లాడుతూ, గురువారం జరిగిన పోలింగ్‌కు ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలంతా ఓటింగ్‌కు తరలివచ్చారని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మార్పుకోరుకుంటున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. 
 
గత ఐదేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత దుర్మార్గంగా పాలన సాగించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి స్వప్రయోజనాల కోసం పనిచేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ప్రజలు చైతన్యవంతులై.. ఓటు హక్కుని వినియోగించుకున్నారని చెప్పుకొచ్చారు. రానున్నవి మంచిరోజులని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజాసంక్షేమంపై దృష్టి పెడతామన్నారు. 
 
పైగా, ఎన్నికల పోలింగ్ సమయంలో టీడీపీ నేతలు అనేక అరాచకాలు సృష్టించారు. తమపై అసత్యకరమైన ఆరోపణలు సృష్టించారు. వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు. భయనక వాతవారణం సృష్టించారు. అంతటితో ఆగకుండా ఎల్లో మీడియా ద్వారా అసత్య రాతలు రాశారు.  ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర దుర్బిక్ష పరిస్థితులున్నాయి. ప్రజలు త్రాగునీటి కోసం అలమటిస్తున్నారు. ఇటువంటి సమస్య రావడానికి టీడీపీయే కారణం. ప్రభుత్వ నిధులను టీడీపీ సొంత ప్రచారానికి ఉపయోగించుకుందని ఆరోపించారు. 
 
కానీ, ఈ ఎన్నికల తర్వాత వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అభిమానులు తరలివచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్, కువైట్‌ నుంచి ప్రవాసాంధ్రులు కష్టపడి వచ్చి ఓటును వినియోగించుకున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. అధికారంలో లేకపోయిన, ఆర్థిక సమస్యలున్నా.. వైఎస్సార్‌సీపీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, వారందరి ఋణం తీర్చుకుంటామని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.