జగన్..నయా తుగ్లక్: చంద్రబాబు
జగన్..నయా తుగ్లక్ అని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతికి మద్దతుగా తెనాలిలోని వీఎస్ ఆర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ… ప్రజావేదిక కూల్చి జగన్ విధ్వంసానికి శ్రీకారం చుట్టారన్నారు.
తాను పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. ఓ వ్యక్తిపై కోపంతో రాజధాని మార్చడం సరికాదని జాతీయ మీడియా అంతా ఖండించిందన్నారు. మన తుగ్లక్‌కు ఇంకా జ్ఞనోదయం కాలేదన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు సామాజిక స్పృహ లేదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధానిపై వైసీపీ ఎంపీని నిలదీశారని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని అన్నారు. జగన్ వడ్డీతో సహ చెల్లించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు..చిల్లర రౌడీలు జేఏసీ టెంట్ కాల్చుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. బోస్టన్ కమిటీ భోగస్ కమిటీ అని అన్నారు. తాము అడ్డుకుంటే జగన్ రాష్ట్రంలో తిరిగేవారా? అని ప్రశ్నించారు.
తాము తలుచుకుంటే మీరు ఎక్కడ ఉండేవారని వైసీపీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. ముద్దులు పెట్టుకుంటూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే..వైసీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై అమరావతి అంటే విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నారని చెప్పారు.