మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 19 మార్చి 2022 (20:23 IST)

మేడం మీరు రండి.. మేము గెలిపిస్తాం: వాణీ విశ్వనాథ్‌కు జనసేన ఆహ్వానం..

నగరిలో రోజాకు ధీటుగా సినీనటి వాణీ విశ్వనాథ్‌కు రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది జనసేన పార్టీ. స్వయంగా జనసైనికులే వాణీ విశ్వనాథ్‌ను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు నగరి నుంచి పోటీ చేయాలని కూడా కోరుతున్నారు. అది కూడా నగరిలో రోజా మీద పోటీకి వాణీ విశ్వనాథ్ అయితేనే సరిపోతుందన్న ఆలోచనలో జనసైనికులు ఉన్నారు. 

 
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుత్తూరులో జనసేన పార్టీ నాయకులు వినూత్నంగా కార్యక్రమాన్ని చేపట్టారు. వాణీ విశ్వనాథ్ జనసేనలోకి రావాలంటూ ప్లకార్డులను, ఫ్లెక్సీలను పట్టుకున్నారు. వాణీ విశ్వనాథ్ సేవలు నగరి ప్రజలకు అవసరమన్నారు. వాణీ విశ్వనాథ్‌ను గెలిపించుకోవడానికి నగరి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

 
అయితే ఇప్పటికే వాణీ విశ్వనాథ్ తను నగరి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఏ పార్టీ అన్న విషయాన్ని మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు కుండబద్ధలు కొట్టారు. 

 
వాణీ విశ్వనాథ్ ప్రకటన, జనసైనికుల వినూత్న కార్యక్రమంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. వాణీ నగరి నుంచి నిలబడితే మాత్రం రోజాకు పెద్ద చెక్‌గా భావిస్తున్నారు. రోజాకు ప్రజల నుంచి వ్యతిరేకత ఉందని.. కాబట్టి ఇది కలిసొచ్చే అంశంగా జనసేన భావిస్తోంది. మరి చూడాలి... వాణీ విశ్వనాథ్ అసలు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి.