శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 7 అక్టోబరు 2018 (17:34 IST)

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి నాకు శత్రువు కాదు.. పవన్ కల్యాణ్

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తనకు శత్రువు కాదంటూ పవన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జగన్ తన శత్రువు కాదని, తనకు శత్రువులెవరూ కూడ లేరని చెప్పారు

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డితో పవన్ పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తనకు శత్రువు కాదంటూ పవన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జగన్ తన శత్రువు కాదని, తనకు శత్రువులెవరూ కూడ లేరని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. తాను పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఎన్టీఆర్ మాదిరిగా ఉప్పెన లేదన్నారు. 
 
అంతేకాదు.. తన సోదరుడు చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో అభిమానుల ప్రవాహం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తారనే ఉద్దేశ్యంతోనే తాను 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు  తెలిపారు. మోసాలు చేస్తే  చూస్తూ ఊరుకోనని పవన్ కళ్యాణ్ చెప్పారు.
 
అయితే జగన్ శత్రువు కాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో పవన్ జగన్‌తో పొత్తు పెట్టుకుంటారా అనే దానిపై చర్చ మొదలైంది. కానీ గతంలో పవన్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ కూడ ఘాటుగానే స్పందించారు. తాను కూడ వ్యక్తిగత విమర్శలు చేయగలనని హెచ్చరించారు. కాబట్టి పొత్తు కూడా వుండకపోవచ్చునని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.