బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 ఏప్రియల్ 2025 (17:11 IST)

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

bolisetty srinivas
జనసేన పార్టీకి చెందిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు ఉంటున్న కొందరు నేతలు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని, అలా జరిగితే వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోవాలని ఆశిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాడేపల్లిగూడెంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. 
 
"నేను పోతే ఉప ఎన్నిక వస్తుంది. ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని కొందరు ఆశపడుతున్నారు" అని అన్నారు. తన గెలుపు వెనుక ఎవరి త్యాగాలు లేవన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ఇచ్చిన మ్యాండేట్‌తోనే తాను గెలిచానని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని, ఎవరి దయాదాక్షిణ్యాలపై తాను ఆధారపడలేదన్నారు. 
 
నియోజకవర్గంలో అధికారులు ఇబ్బందిపెట్టినా బెదిరించినా సహించేది లేదన్నారు. అలాంటి వారి నుంచి అధికారులను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. "నేను పోయాకే మీరు ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను" అంటూ తనపై కుట్ర చేస్తున్నవారిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 
 
తాను ఎలాంటి స్థలాలు, పొలాలు కబ్జా చేయలేదన్నారు. కేవలం తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల క్షేమం కోసమే పని చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలోని ఓ ఒక్క కార్యకర్తను ఇబ్బంది పెట్టలేదని, అయితే శాసనసభ్యుడుగా తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూటమిలోని మిత్రపక్ష నాయకులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.