రాజమహేంద్రవరంలో జనసేన... పవన్‌కు ఘనస్వాగతం
ఏపీలోని రెండు జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు శ్రమదానం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో పవన్‌కు జనసేన శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా జనసేన ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారిపై పవన్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కాగా, భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. మరోవైపు అనంతపురం జిల్లాలో కూడా పవన్ పర్యటించనున్నారు.
మరోవైపు పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పవన్ అభిమానులను ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. పవన్ సభ నిర్వహించనున్న బాలాజీపేటకు ఇరువైపుల 5 కి.మీ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బాలాజీపేట పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ లలితకుమారి తెలిపారు. పవన్ కల్యాణ్ సభకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి పవన్ బాలాజీపేటకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, ప్రజలకు అభివాదం చేశారు. దారి పొడవునా జనసైనికులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు.