జగన్‌తో జూనియర్ ఎన్టీఆర్ మామ మంతనాలు?
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, నార్నే ఇండస్ట్రీస్ అధినేత నార్నే శ్రీనివాస రావు సమావేశమ్యాయారు. ఇది కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిన భేటీ అని ఆయన చెబుతున్నప్పటికీ... నిజానికి నార్నే శ్రీనివాస రావు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్న ఉద్దేశ్యంతోనే సమావేశమైనట్టుగా ప్రచారం సాగుతోంది.
నిజానికి గత కొన్ని రోజులుగా అధికార టీడీపీ నుంచి భారీగా వైకాపాలోకి వలసలు జరుగుతున్నాయి. నేడో రేపో మరో ఎంపీ, మరో మంత్రి కూడా వైకాపాలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి తండ్రి, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నార్నే శ్రీనివాస రావు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
పైగా, ఎన్నికల సమయంలో ఇది మరింత రాజకీయ వేడిని పెంచింది. అయితే, ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని నార్నే శ్రీనివాస రావు మీడియాతో అన్నారు. కేవలం మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలిశానని చెప్పారు. జగన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని... ఈ క్రమంలోనే ఆయనను కలిశానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీలోకి నార్నే శ్రీనివాసరావు చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ పార్టీలో అప్పుడు ఆయన చేరలేదు.