మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (08:22 IST)

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధిపతిగా తొలి తెలుగు వ్యక్తి

sanjay murthy
కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధిపతిగా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొండ్రు సంజయ్ మూర్తిని కేంద్రం ఎంపిక చేసింది. కాగ్ చీఫ్‌గా ఒక తెలుగు వ్యక్తి నియమితులు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగ్ చీఫ్‌గా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారని కేంద్రం వెల్లడించింది. 
 
ఈయన సంజయ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు కావడం గమనార్హం. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరపున అమలాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలు అందించారు.
 
24 డిసెంబర్ 1964లో జన్మించిన సంజయ్ మూర్తి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సెప్టెంబర్ 2021 నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
నిజానికి ఆయన వచ్చే నెలలో ఉద్యోగం నుంచి విరమణ పొందాల్సి ఉండగా ఆయన సేవలను మెచ్చిన ప్రభుత్వం కాగ్‌ చీఫ్‌గా నియమించడం గమనార్హం. గరిష్ఠంగా ఆరేళ్లు, లేదంటే 65 ఏళ్ల వయసు వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత కాగ్ గిరీశ్‌చంద్ర ముర్ము పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్‌గా నియమించారు.