కలాం ఆదర్శంగా యువత ఉన్నత లక్ష్యాలు: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
యువత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో తగరపువలసలోని అవంతి కాలేజ్ లో జరిగిన జాబ్ మేళా-2021 లో మంత్రి పాల్గొన్నారు.
ఈ జాబ్ మేళా యువతకు ఒక నిచ్చెన వంటిదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు వెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా జీవో తీసుకొచ్చారని తెలిపారు. కంపెనీలు కూడా స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా నిరుద్యోగాన్ని తగ్గించాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమని ఆయన చెప్పారు.
డిగ్రీ చదివిన యువత కూడా తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకుని జీవితంలో పైకి ఎదగాలన్నారు. హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని.. తమలోనున్న నైపుణ్యంతో ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని అన్నారు. యువతకు ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, హార్డ్ వర్క్, నిజాయితీ, నిబద్ధత ఎంతో ముఖ్యమని అన్నారు.
ప్రతిరంగంలోనూ మంచి, చెడు ఉంటాయని.. మంచివైపు అడుగులేస్తూ జీవితంలో ఎదగాలని అన్నారు. స్వామి వివేకానంద భావాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన నిజమైన హీరో అన్నారు. జాబ్ మేళాలో 1860 పోస్టులు ఉన్నాయని.. 32 సంస్థలు ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చాయని.. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి అభిలాషించారు.