1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (15:10 IST)

ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో తండ్రే హంతకుడు?

కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని రాధిక (16) హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మిస్టరీగా మారిన ఈ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. రాధిక కేసులో కుటుంబసభ్యుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు బలంగా భావించారు. వారి అనుమానాలు నిజమయ్యాయి. ఫలితంగా రాధిక హత్య కేసులో తండ్రే హంతకుడని తేలినట్టు సమాచారం. దీంతో రాధిక తండ్రి కొమరయ్య పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, కరీంనగర్‌ పట్టణంలోని విద్యానగర్ వెంకటేశ్వర కాలనీలో ఫిబ్రవరి 10న ఇంట్లోనే రాధిక దారుణ హత్యకు గురైంది. గొంతు కోసి అతి కిరాతకంగా రాధికను హత్య చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణం జరిగింది. ఆ సమయంలో కూలి పనుల కోసం బయటకు వెళ్లామని రాధిక తల్లిదండ్రులు పోలీసులతో చెప్పారు. 
 
పక్కింట్లోని తొమ్మిదేళ్ల పిల్లాడు ఆ ఇంటికి రావడంతో రాధిక హత్య కేసు విషయం వెలుగులోకి వచ్చింది. రాధిక హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. రాధికను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది తెలుసుకోవడం పోలీసులకు కష్టసాధ్యమైంది. ఏ ఒక్క ఆధారం చిక్కక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
 
అయితే, ఇంట్లో అద్దెకు ఉండే కుర్రాడు... కొంతకాలంగా రాధిక వెంట పడుతున్నాడని, అతడే చంపి ఉంటాడని తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాఫ్తు చేశారు. ఆ కుర్రాడి కోసం 75 మంది పోలీసులతో... 8 బృందాలు ఏర్పాటు చేశారు. 20 రోజులు వెతికినా... అతను కనిపించ లేదు. ఈలోగా దర్యాప్తులో కొత్త విషయాలు తెలిశాయి. 
 
కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటా, పోస్టుమార్టం రిపోర్ట్ పరిశీలిస్తే... కుటుంబ సభ్యులే ఆమెను చంపేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు రాధికను చంపి ఉంటారని... అనుకుంటున్న పోలీసులు... తాజాగా... రాధిక తండ్రిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 
 
మార్చి ఒకటో తేదీ ఆదివారం ఆ ఇంట్లో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి సోమవారం మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తండ్రే రాధికను చంపి ఉంటే... ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.