బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి - ఈటల రాజేందర్‌లకు కీలక పదవులు
భారతీయ జనతా పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కీలక పదవులను కట్టబెట్టింది. కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఆయన సుధీర్ఘమైన రాజకీయ అనుభవనాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఆయనకు జాతీయ స్థాయిలో కీలక పదవిని కట్టబెట్టింది. ఆ పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. తద్వారా ఆయన సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోనుంది. కిరణ్ కుమార్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ హైకమాండ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. హుజురాబాద్ ఎమ్మెల్యే అయిన ఈటల ఇప్పటివరకు పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. అయితే, గత ఆయన పార్టీని వీడనున్నట్టు గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను పార్టీ మారడం లేదని, పార్టీకి విధేయుడిగానే ఉంటానని తెలిపారు. ఈ ప్రకటన బీజేపీ అధినాయకత్వాన్ని మెప్పించడంతో ఆయనకు కీలక పదవిని అప్పగించారనే ప్రచారం సాగుతోంది.
ఏపీకి పురంధేశ్వరి.. తెలంగాణాకు కిషన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చివేసింది. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గుబాటి పురంధేశ్వరి, తెలంగాణాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, షెకావత్‌తో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు.
ఏపీ బీజేపీ శాఖ అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లను వినిపించినప్పటికీ చివరకు ఊహించని విధంగా ఆ పదవి పురంధేశ్వరికి దక్కింది. మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది.