కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థిగా చెన్నుబోయిన చిట్టిబాబు
హైకోర్టు జోక్యంతో కొండపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభం అయింది. ఈ ఉదయం ఎన్నికలను పోలీసు బందోబస్తుతో పకడ్బందీగా నిర్వహించాలని కోర్టు సూచించడంతో అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కొండపల్లి మున్సిపల్ ఎన్నికల అధికారి ఎంపీ కేశినేని నానిని ఎక్స్ అఫిషియో మెంబరుగా ఛైర్మన్ ఎన్నికకు ఆహ్వానించారు. ఆయన తమ పార్టీ కౌన్సిలర్లతో కొండపల్లి మున్సిపాలిటీకి చేరారు. ముందుగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నికలను బహిరంగ విధానంలో నిర్వహించారు.
వైసీపీ తరపున ఛైర్ పర్సన్ అభ్యర్ధిగా జోగి రాము, టీడీపీ తరపున ఛైర్ పర్సన్ అభ్యర్థిగా చెన్నుబోయిన చిట్టిబాబు పేర్లను ప్రతిపాదించారు. ఎంపీ కేశినేని నాని ఓటుతో సహా 14 మంది టీడీపీ సభ్యులు, ఒక ఇండిపెండెంట్ కలిపి 16 మంది సభ్యులు చిట్టిబాబుకు చేతులెత్తి ఓటు చేశారు. వైస్ చైర్మన్లుగా 29 వ వార్డు కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాస్, పదో వార్డు టిడిపి కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి లకు సభ్యులంతా ఆమోదం తెలిపారు. అయితే, హైకోర్టు ఆదేశాలతో ఫలితాలు ప్రకటించలేదు.
ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందన్నారు. తమ వైసిపి సభ్యులు 15 మంది బలం ఉందని, టిడిపికి ఉన్న 16ఓటు పైనే తమకు అభ్యంతరాలున్నాయని చెప్పారు. ఆ ఓటు చెల్లుబాటు కాదని తాము మొదటి నుంచీ చెబుతున్నామని, కోర్టు తీర్పు కూడా రేపు ఆ 16వ ఓటు చెల్లదని వస్తుందని భావిస్తున్నామన్నారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా, దానికి బాధ్యులుగా ఉంటామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఒక వేళ కోర్టు తీర్పు, ఆ ఎంపీ ఓటు చెల్లదని వస్తే, ఇక టాస్ ద్వారా కొండపల్లి ఛైర్మన్ ఎంపిక జరుగుతుంది.