గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 24 నవంబరు 2021 (10:29 IST)

కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ ఎన్నికలో ఉత్కంఠ‌; హైకోర్టు తీర్పుతో భారీ భ‌ద్ర‌త‌!

హైకోర్టు ఆదేశాలను అనుసరించి కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ఈరోజు ఉదయం ప్రారంభ‌మైంది. ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా హాజరుకావల్సినది కోరుతూ, విజయవాడ ఎంపీ  కేశినేని నానికి ఎన్నికల అధికారి నోటీసులు అందించారు. దీనితో విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులో కొండపల్లికి టీడీపీ స‌భ్యులు బయల్దేరారు.


త‌మ పార్టీకి చెందిన కౌన్సిల‌ర్ల‌తో కలిసి ఎంపీ కేశినేని నాని వెళ్ళారు. ఆ బస్సులో కేవ‌లం కౌన్సిల‌ర్ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. చివ‌రికి పార్టీ నేత‌, మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమను కూడా బస్సులోకి పోలీసులు అనుమతించ లేదు.  14 మంది టీడీపీ, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థితో కలిపి మొత్తం 15మంది వార్డ్ కౌన్సిలర్ సభ్యులతో మున్సిపల్ కార్యాలయంలోకి టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్ర‌వేశించారు. నిన్న వాక‌వుట్ చేసిన వైసీపీ స‌భ్యులు వ‌స్తే, ఎన్నిక‌ను ప్రారంభించేందుకు ఎన్నిక‌ల అధికారులు సిద్ధం అయ్యారు. 

 
కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ ఎన్నిక ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మార‌డంతో, పటిష్ట బందోబస్తు మధ్య మున్సిపల్ కార్యాలయాని ప్ర‌త్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విజ‌య‌వాడ సీపీ ఆధ్వ‌ర్యంలో కొండపల్లి మున్సిపల్‌ కార్యాలయం వద్దకు భారీగా పోలీసులు బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. నిన్న 400 మంది కార్యాలయం ప్రాంగణంలో పహారా ఉండగా, ఇవాళ 750 పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
 
 
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కోర్టును ఆశ్రయించిన టీడీపీ కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థి కె.శ్రీలక్ష్మి, ఎంపీ కేశినేని నానికి పోలీసు భద్రత కల్పించాలని విజయవాడ ఇంఛార్జి పోలీసు కమిషనర్‌ జి.పాలరాజుకు కోర్టు నిన్నస్పష్టం చేసింది. ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నికను నిర్వహించాలని.. కానీ ఫలితాలు ప్రకటించొద్దని ఆదేశించింది. ఎంపీ కేశినేని నాని ఓటు వినియోగం ఈ వ్యాజ్యంలో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు.