ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (17:22 IST)

కరోనా వ్యాక్షినేషన్ లో జర్నలిస్టులకు ప్రాధాన్యత : కలెక్టర్ ఇంతియాజ్

ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్షినేషన్ ప్రక్రియలో జర్నలిస్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కృష్ణా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ హమీ ఇచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఎపియుడబ్ల్యుజె కృష్ణా అర్బన్ యూనిట్ ముద్రించిన మీడియా డైరీ-2021 ను కలెక్టర్ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో జర్నలిస్టుల సహకారం, కృషి అభినందనీయమన్నారు. ఈ నెలలో ప్రారంభం కానున్న వ్యాక్షినేషన్ కార్యక్రమంలో ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు విభాగాల వారి ఇచ్చే ప్రాధాన్యతల్లో జర్నలిస్టులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు ద్వారా వ్యాక్షన్ అందిస్తామన్నారు. 
 
అలాగే అక్రిడేషన్ మంజూరులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ముక్యంగా ప్లాస్టిక్ వినియోగం అరికట్టేందుకు, కాలువల్లో మురుగు, చెత్త తొలగింపుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయన్నారు. ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ సమగ్ర సమాచారంతో ముద్రించిన ఎపియుడబ్ల్యుజె కృష్ణా అర్బన్ డైరీ జర్నలిస్టులకు, రాజకీయ నాయకులు, అధికారులకు కరదీపిక వంటిదన్నారు. 
 
జర్నలిస్టుల సమస్యల పరిస్కారంలో కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ కృషి మరువలేనిదని కొనియాడారు. ఎపియుడబ్ల్యుజె కృష్ణా అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ షేక్ బాబు, కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.