శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జులై 2020 (14:10 IST)

సీఎం జగన్ సర్కారుకు షాకిచ్చిన కృష్ణా బోర్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా బోర్డు తేరుకోలేని షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కృష్ణాబోర్డు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ పథకానికి సంబంధించి ముందుకెళ్లొద్దని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు పూర్తి నివేదికను సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.
 
కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్‌కు నివేదికను పంపాలని... అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు కృష్ణా బోర్డు కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంపై నీళ్లు చల్లినట్టైంది. 
 
కాగా, ఈ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా, తమతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఆ ఎత్తిపోతల పథకాన్ని ఎలా చేపడుతారంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. అవసరమైతే ఈ విషయంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన ప్రకటించి, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు.