సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (11:49 IST)

తప్పు చేయకపోతే.. ఉలికిపాటు ఎందుకు చంద్రమా? కేటీఆర్ సూటి ప్రశ్న

తెలుగు రెండు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య ఐటీ గ్రిడ్ సంస్థ డేటా చోరీపై మాటల యుద్ధం కొనసాగుతోంది. డేటా దుర్వినియోగంపై ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. 
 
డేటా స్కామ్‌పై ట్విటర్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం చంద్రబాబు.? భయంతోనే విచారణకు ముందుకు రావడంలేదు? పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రభుత్వం ఓ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమేనంటూ కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. 
 
'ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే' అన్నట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు చంద్రబాబు? తెలంగాణ పోలీసుల దర్యాప్తునకు ఏపీ పోలీసులు అడ్డుకోవడం, కోర్టులో తప్పుడు పిటీషన్లు వేయడం వంటి పరిణామాలు చూస్తుంటే.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించడంలో చంద్రబాబు పాత్రను పరోక్షంగా నిర్దారిస్తుంది. ఈ అంశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కె. తారక రామారావు డిమాండ్ చేశారు.