గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (12:36 IST)

చంద్రబాబు రాజకీయ మూలాలు ఏ పార్టీవి? కేటీఆర్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తెరాస వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ మరోమారు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయ మూలాలు ఎక్కడవి అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబే స్థాపించారా? అని నిలదీశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. వారిలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య. ఈయన టీడీపీకి రాజీనామా చేసి తెరాసలో చేరనున్నారు. ప్రజల అభీష్టం మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. 
 
దీనిపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఫలితంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. భవిష్యత్తు కోసం, తమ ప్రాంత, నియోజకవర్గ అభివృద్ధి కోసం నాయకులు పార్టీ మారడం తప్పు కాదన్నారు. చంద్రబాబునాయుడు పార్టీ మారలేదా? చంద్రబాబునాయుడే పెట్టించారా తెలుగుదేశం పార్టీని అని కేటీఆర్ ప్రశ్నించారు. 
 
అలాగే, పార్టీ మారితే అమ్ముడు పోయినట్లు మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ ఎంపీ కాంగ్రెస్‌లో చేరడం ఒప్పు అవుతుందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకే చెందిన వాళ్లా? వాళ్లు ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్లు కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.