ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (17:36 IST)

ఒకరికి వైఎస్సార్... మరొకరికి చంద్రబాబు...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు, వైఎస్.రాజశేఖర్ రెడ్డి, వీరిద్దరి రాజకీయ జీవితం స్నేహంతో మొదలైనా ఆ తర్వాత ఒకరికి ఒకరు రాజకీయ ప్రత్యర్థులుగా మారడం జరిగింది. అయితే ఒక్కరిలోనే ఆ ఇద్దరినీ చూసుకునే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతోంది.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇటు నారా చంద్రబాబు నాయుడు, అటు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ తమదైన ముద్రను వేస్తూ తమదైన పాలనని కొనసాగించారు. 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత 1999 ఎన్నికల్లో తెదేపాని తనదైన నాయకత్వంలోనే విజయపథంలో నడిపారు. 
 
అలాగే 2004లో తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వై.యస్.ఆర్ ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లోనూ ఒంటిచేత్తో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ రకంగా వీరిద్దరిలోనూ నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయనే మెజారిటీ జనం చెప్తూంటారు.
 
అయితే, ప్రస్తుత విశేషానికి వస్తే... ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఒకే వ్యక్తిలో ఇటు నారా చంద్రబాబు నాయుడుని, అటు వైయస్ఆర్‌నీ చూడబోతున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఎన్టీయార్' బయోపిక్‌లో వైయస్ఆర్‌గా నటించిన శ్రీతేజ్.. త్వరలో విడుదల కాబోతున్న 'లక్ష్మీస్ ఎన్టీయార్'లో చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించనున్నాడు. వర్మ తెరకెక్కించిన 'వంగవీటి'లో శ్రీతేజ్.. దేవినేని నెహ్రూ పాత్రను పోషించాడు. 
 
ఆ తర్వాత 'టచ్ చేసి చూడు', 'ఆటగాళ్ళు' చిత్రాల్లోనూ కీలకపాత్రలు చేశాడు. ఈ యువ నటుడిలో క్రిష్‌కు వైయస్ఆర్ కనిపిస్తే.. వర్మకు చంద్రబాబు కనిపించడం విశేషమనే చెప్పాలి. వైఎస్సార్‌గా మారిన శ్రీతేజ్‌నైతే మనం చూసేసాము గానీ... మరి చంద్రబాబుగా అతని బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.